ఆదికాండం 21
1 యెహోవా తాను చెప్పినట్టే శారా పై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు. 2 అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది. అబ్రాహాముతో దేవుడైన యెహోవా చెప్పిన సమయంలోనే ఇది జరిగింది. 3 అబ్రాహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు. 4 దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు. 5 ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు నూరేళ్ళు. 6 అప్పుడు శారా “దేవుడు నాకు నవ్వు పుట్టించాడు. నా సంగతి తెలిసినవారంతా నాతో కలసి సంతోషిస్తారు” అన్నది. 7 ఆమె ఇంకా “శారా తన పిల్లలకు పాలు ఇస్తుందని అబ్రాహాముతో ఎవరు చెప్పగలిగే వారు? అయినా ముసలివాడయ్యాక నేను అతనికి ఒక కొడుకుని కని ఇచ్చాను గదా” అన్నది. 8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిపెట్టాడు. ఇస్సాకు పాలు మానిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు. 9 అప్పుడు అబ్రాహాముకు ఐగుప్తు జాతిదైన హాగరు ద్వారా పుట్టిన కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం శారా చూసింది. 10 ఆమె అబ్రాహాముతో ఇలా అంది. “ఈ దాసీనీ ఈమె కొడుకునీ వెళ్ళగొట్టు. ఎందుకంటే ఈ దాసీ కొడుకు నా కొడుకు ఇస్సాకుతో కలసి వారసుడిగా ఉండటానికి వీలులేదు.” 11 ఈ మాట విన్న అబ్రాహాము తన కొడుకు ఇష్మాయేలుని బట్టి చాలా వేదన చెందాడు. 12 అయితే దేవుడు “ఈ అబ్బాయి కోసం, నీ దాసీ కోసం నువ్వు బాధ పడవద్దు. ఈ విషయంలో శారా నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే ఇస్సాకు వలన కలిగే సంతానమే నీకు వారసులౌతారు. 13 అయినప్పటికీ ఈ దాసీ కొడుకు కూడా నీ సంతానం గనక నేను అతణ్ణి కూడా ఒక జాతిగా చేస్తాను” అని అబ్రాహాముతో చెప్పాడు.