లేవీకాండం 22
1 యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. 2 “అహరోనుతో అతని కొడుకులతో ఇది చెప్పు. వారు ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే వాటిని ప్రత్యేకమైనవిగా భావించాలి. వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను. 3 నీవు వారితో ఇలా చెప్పు. మీ తరతరాలకు మీ సంతతి వారందరిలో ఒకడు అపవిత్రంగా ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపిస్తే అలాంటి వాణ్ణి నా సన్నిధిలో ఉండకుండాా దూరంగా కొట్టివేస్తాను. నేను యెహోవాను. 4 అహరోను సంతానంలో ఎవరికైనా కుష్టువ్యాధి గానీ, శరీరం నుండి రసి లాంటిది కారడం గానీ ఉంటే అలాటి వాడు పవిత్రుడయ్యే వరకూ ప్రతిష్ఠితమైన వాటిలో దేనినీ తినకూడదు. శవాన్ని తాకడం వల్లా, అపవిత్రమైన దేనినైనా ముట్టుకోవడం వల్లా, వీర్యస్కలనం చేసిన వాణ్ణి తాకడం వల్లా, 5 అపవిత్రమైన పురుగును, లేక ఏదో ఒక అపవిత్రత మూలంగా అపవిత్రుడైపోయిన మనిషిని ముట్టుకోవడం వల్లా, అలాటి అపవిత్రత తగిలినవాడు సాయంత్రం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు. 6 అతడు నీళ్లతో తన ఒళ్ళు కడుక్కునే వరకూ ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. 7 సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడౌతాడు. ఆ తరువాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చు. అవి అతనికి ఆహారమే గదా. 8 అతడు చచ్చిన జంతువును గానీ, మృగాలు చీల్చిన వాటిని గాని తిని దాని వలన తనను అపవిత్ర పరచుకోకూడదు. నేను యెహోవాను. 9 కాబట్టి నేను విధించిన నియమాన్ని మీరి, దాని పాపదోషం తనపై వేసుకుని దాని వలన చావకుండేలా చూసుకోవాలి. నేను వారిని పరిశుద్ధ పరిచే యెహోవాను. 10 ప్రతిష్ఠితమైన దాన్ని యూదులు కాని వారు తినకూడదు. యాజకుని ఇంట్లో నివసించే అన్యుడు గాని, సేవకుడు గాని ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. 11 అయితే యాజకుడు తన డబ్బుతో కొనుక్కున్న వాడు, అతని ఇంట్లో పుట్టినవాడు అతడు తినే ఆహారం తినవచ్చు. 12 యాజకుని కుమార్తెను అన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె ప్రతిష్ఠితమైన అర్పణల్లో దేనినీ తినకూడదు. 13 యాజకుని కుమార్తెల్లో వితంతువుగానీ, విడాకులు తీసుకున్నది గానీ పిల్లలు పుట్టక పోవడం వల్ల ఆమె తన బాల్యప్రాయంలో వలె తన తండ్రి యింటికి తిరిగి చేరితే తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు. అన్యుడు మాత్రం దాన్ని తినకూడదు. 14 ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దాన్ని తింటే వాడు ఆ ప్రతిష్ఠితమైన దాని విలువలో ఐదో వంతు కలిపి యాజకునికి తిరిగి ఇవ్వాలి. 15 ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినడం వలన అపరాధాన్ని భరించకుండా ఉండాలంటే తాము యెహోవాకు ప్రతిష్ఠించే పరిశుద్ధ వస్తువులను అపవిత్ర పరచకూడదు. 16 నేను అర్పణలను పరిశుద్ధ పరచే యెహోవానని చెప్పు.”