1సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్. హేరోదు గలిలయకు చతుర్థాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి.2అన్న, కయప ముఖ్య యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది.3అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు.4యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన బాటలు తిన్నగా చేయండి.5ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.6ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.”7అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?8పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను.9ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు.10అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.11అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు.12పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.13అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.14“మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.15క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు.16వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.17తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”18అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.19అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు.20హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు. మత్తయి 3:13-17; మార్కు 1:9-11
యేసు బాప్తిసం
21ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది.22పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”