సామెతలు 22
1 గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి. 2 ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే. 3 బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు. 4 యెహోవా పట్ల భయభక్తులు వినయాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని తెస్తాయి. 5 ముళ్ళు, ఉచ్చులు మూర్ఖుల దారిలో ఉన్నాయి. తనను కాపాడుకొనేవాడు వాటికి దూరంగా ఉంటాడు. 6 పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు. 7 ఐశ్వర్యవంతుడు పేదలపై పెత్తనం చేస్తాడు. అప్పుచేసిన వాడు అప్పిచ్చిన వాడికి బానిస. 8 దుర్మార్గాన్ని విత్తనంగా చల్లేవాడు కీడు అనే పంట కోసుకుంటాడు. వాడి క్రోధమనే కర్ర నిరర్థకమై పోతుంది. 9 ఉదార గుణం గలవాడికి దీవెన. ఎందుకంటే అతడు తన ఆహారంలో కొంత పేదవాడికి ఇస్తాడు. 10 తిరస్కారబుద్ధి గలవాణ్ణి వెళ్ళగొట్టు. కలహాలు, పోరాటాలు, అవమానాలు వాటంతట అవే సద్దు మణుగుతాయి. 11 శుద్ధ హృదయాన్ని ప్రేమిస్తూ ఇంపైన మాటలు పలికే వాడికి రాజు స్నేహితుడౌతాడు. 12 జ్ఞానం గలవాడిపై యెహోవా చూపు నిలుపుకుని అతణ్ణి కాపాడతాడు. విశ్వాస ఘాతకుల మాటలు ఆయన కొట్టి పారేస్తాడు. 13 సోమరి “బయట సింహం ఉంది, బయటికి వెళ్తే చచ్చిపోతాను” అంటాడు. 14 వేశ్య నోరు లోతైన గొయ్యి. యెహోవా శాపాన్ని మూటగట్టుకున్నవాడు దానిలో పడతాడు. 15 పిల్లవాడి హృదయంలో మూఢత్వం సహజంగానే ఉంటుంది. బెత్తంతో విధించే శిక్ష దాన్ని వాడిలోనుండి తోలివేస్తుంది. 16 తన ఆస్తిపాస్తులు పెంచుకోవాలని పేదలను పీడించే వారికి, ధనవంతులకే ఇచ్చే వాడికి నష్టమే కలుగుతుంది.