పరమ గీతము 7
1 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) రాకుమారీ, చెప్పులు తొడిగిన నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! నీ తొడల వంపులు నిపుణుడైన కంసాలి పనితనంతో చేసిన ఆభరణాల్లాగా ఉన్నాయి. 2 నీ బొడ్డు గుండ్రని కలశంలా ఉంది. కలిపిన ద్రాక్షారసం దానిలో ఎప్పుడూ వెలితి కాదు. నీ నడుము లిల్లీ పూలు చుట్టిన గోదుమరాశిలా ఉంది. 3 నీ జత స్తనాలు కవల జింకపిల్లల్లా ఉన్నాయి. 4 నీ మెడ దంతగోపురంలా ఉంది. నీ కళ్ళు బత్ రబ్బీం ద్వారం దగ్గరున్న హెష్బోను జలాశయాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు వైపు చూస్తున్న లెబానోను శిఖరంలా ఉంది. 5 నీ తల కర్మెలు పర్వతంలా ఉంది. నీ జుట్టు ముదురు ఊదా రంగు. నొక్కులు తిరిగిన ఆ జుట్టుకు రాజు వశమైపోయాడు. 6 నా ప్రేయసీ, నీ హర్షంతో నువ్వెంత అందంగా లలిత లావణ్యంగా ఉన్నావు! 7 నువ్వు తాడి చెట్టులా తిన్నగా ఉన్నావు. నీ స్తనాలు పండ్ల గెలల్లా ఉన్నాయి. 8 “ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను. నీ స్తనాలు ద్రాక్షగెలల్లా, నీ శ్వాస సీమ బాదం వాసనలా ఉండాలి. 9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి. మన పెదాల మధ్య, పళ్ళ మధ్య చక్కగా స్రవిస్తూ ఉండాలి.