హెబ్రీయులకు రాసిన పత్రిక 6
1 కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను వదలి, మరింత పరిణతి సాధించే దిశగా సాగిపోదాం. నిర్జీవ క్రియల కోసం పశ్చాత్తాప పడటమూ, దేవునిపై విశ్వాసమూ, 2 బాప్తీసాలూ, తలపై చేతులుంచడమూ, చనిపోయినవారు పునర్జీవితులు కావడమూ, నిత్య శిక్షా వంటి ప్రాథమిక అంశాలపై మళ్ళీ పునాది వేయకుండా ముందుకు సాగుదాం. 3 ఒకవేళ దేవుడు అనుమతిస్తే అలా చేస్తాం. 4-5 తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందిన వారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్ధాత్మలో భాగం పొందినవారు దేవుని శుభవాక్కునూ, రాబోయే కాలం తాలూకు శక్తులనూ రుచి చూసిన వారు ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం. 6 ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వారే మళ్ళీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు. 7 ఇది ఎలాగంటే, నేల తరచుగా తనపై కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది. 8 అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై శాపానికి గురి అవుతుంది. తగలబడిపోవడంతో అది అంతం అవుతుంది. 9 ప్రియమైన స్నేహితులారా, మేము ఇలా మాట్లాడుతున్నప్పటికీ మీరింతకంటే మంచి స్థితిలోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మంచి స్థితిలోనే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాం. 10 దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. పరిశుద్ధులకు మీరు సేవలు చేశారు. చేస్తూనే ఉన్నారు. దేవుని నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమనూ మీ సేవలనూ ఆయన మర్చిపోడు. 11 మనం దేని కోసం ఎదురు చూస్తున్నామో దాని విషయంలో మీలో ప్రతివాడూ సంపూర్ణ నిశ్చయతతో, శ్రద్ధతో చివరి వరకూ సాగాలని మా అభిలాష. 12 మీరు మందకొడిగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. విశ్వాసంతో, సహనంతో, వాగ్దానాలను వారసత్వంగా పొందిన వారిని అనుకరించాలని కోరుకుంటున్నాం.